ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. కాగా.. సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో అత్యధికంగా 40.9 డిగ్రీలు, ఇదే జిల్లా గార్ల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలలో 40.8 డిగ్రీలు, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ, కామారెడ్డి జిల్లా బిక్‌నూరు, మహబూబాబాద్‌ జిల్లా జానంపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో 40.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) తెలిపింది.