హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లలో సమస్య తెలెత్తింది. పలు స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు పనిచేయడం లేదు. దీంతో.. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే అన్ని మార్గాల్లోని మెట్రో స్టేషన్లలో ఈ సమస్య తలెత్తింది. 

విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో పాటు, జనరేటర్లు కూడా సరిగా పనిచేయకపోవడమే సమస్యకు కారణమని తెలుస్తోంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు పనిచేయకపోవడంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందిపడ్డారు. 

ఉదయం పూట ఎక్కువగా రద్దీ ఉండే సమయంలో ఎస్కలేటర్లు పనిచేయకపోవడంతో అంతా మెట్ల మార్గం నుంచి ఫ్లాట్‌ఫాం వద్దకు చేరుకున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్ మెట్రో  ఈమధ్యకాలంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతుండటం గమనార్హం.