రాజేంద్రనగర్: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ శివారులో హడలెత్తిస్తున్న చిరుతను ఎట్టకేలకు అటవిశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రాత్రి మరోసారి రాజేంద్రనగర్ పరిసరాల్లో చిరుత సంచారంపై సమాచారం రావడంతో ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ఓ బోనులో చిక్కింది చిరుత. చిరుతను హైదరాబాద్ లోని జూపార్కుకు తరలించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిసరాల్లోకి శనివారం రాత్రి ప్రవేశించిన చిరుత స్థానికులను భయాందోళనకు గురిచేసింది. హిమాయత్ సాగర్ సమీపంలోని ఓ పశువులపాకలోంచి రెండు లేగదూడలను ఎత్తుకెళ్లి చంపేసింది. దీంతో బాధితుడు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా చిరుత సంచారంపై రాజేంద్రనగర్‌ పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. 

దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ శాఖ అధికారులు చిరుతను పట్టుకోడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓ బృందం చిరుతను పట్టడానికి రెండు బోన్లను, 10 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటుచేసిన ఓ బోనులో చిక్కింది చిరుత.