హైదరాబాద్‌లో చిరుత సంచారం అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో కొద్దిరోజుల క్రితం ఓ చిరుతపులి సంచరించిన వ్యవహారం కలకలం రేపింది.

తాజాగా మరోసారి అదే పులి వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలో సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. సోమవారం రాత్రి వర్సిటి ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డయ్యింది.

ఈ దృశ్యాలను గమనించిన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సీసీటీవీలో చిరుత వెళ్లిన దిశ, దాని అడుగుల ఆధారంగా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు గాను ఇప్పటికే 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి ఫుటేజీని అధికారులు విశ్లేషిస్తున్నారు.

కాగా మే నెలలో కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కనిపించడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. డివైడర్ వద్ద తిష్టవేసి స్థానికులకు భయభ్రాంతులకు గురిచేసింది.. అంతేకాకుండా ఓ లారీ డ్రైవర్‌పైనా దాడి చేసి పారిపోయింది. అప్పటి నుంచి చిరుతను బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.