తెలంగాణ అసెంబ్లీ సమయంలో చోటుచేసుకున్న పార్టీ పిరాయింపుల కారణంగా ముగ్గురు ఎమ్మెల్సీల సభ్యత్వానికి ముప్పు ఏర్పడింది. తమ పార్టీని వీడి క్లిష్టమైన ఎన్నికల సమయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్సీలను ఎంత తొందరగా అయితే అంత తొందరగా పదవీచ్యుతులను చేయాలని టీఆర్ఎస్ అదినాయకత్వం భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే మండలి ఛైర్మన్ స్వామిగైడ్ కు ఫిర్యాదు చేసి తొందరగా వారి సభ్యత్వాలను రద్దు చేయాలని టిఆర్ఎస్ కోరింది. దీనిపై మండలి ఛైర్మన్ కూడా తొందరగానే చర్యలు ప్రారంభించారు. 

ఇప్పటికే ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి మండలి సభ్యత్వాన్ని రద్దుకు రంగం సిద్దమైంది. అయితే ఆ పని పద్దతిప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు చేకుండా చేయాలని ఛైర్మన్ భావిస్తున్నారు. అందుకోసం మొదట ఎమ్మెల్సీలకునోటిసులు పంపించారు. పార్టీ ఫిరాయింపుపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఛైర్మన్ కోరారు. 

ఇక ఆ తర్వాత జరిగే ప్రక్రియను కూడా స్వామిగౌడ్ ప్రారంభించారు. వారు ఇచ్చిన వివరణ ఆధారంగా ఛైర్మన్ విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిన్న శుక్రవారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సిగా ఎన్నికైన రాములు నాయక్ అంశంపై ఛైర్మన్ విచారణ జరిపారు. టీఆర్ఎస్ సభ్యుడిగా వుండి ఎమ్మెల్సీ పదవిని పొంది కాంగ్రెస్‌లో చేరినందుకు ఫిరాయింపుల చట్టం కింద వేటువేసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొందారు కాబట్టి ఎలాంటి న్యాయపరమై ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోడానికి ఛైర్మన్ ప్రయత్నిస్తున్నారు. 

ఇక మిగతా  ఇద్దరు ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి సభ్యత్వ రద్దుపై ఉన్న పిటిషన్‌పై శనివారం విచారించనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలపై ఛైర్మన్  ఒకేసారి చర్యలు తీసపుకోనున్నారని...త్వరలో వీరి సభ్యత్వ రద్దుకు సంబంధించి ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.