రోజురోజుకూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. బడి, గుడి, బస్సు, రోడ్డు అంటూ తేడా లేకుండా కామాంధులు అన్ని చోట్లా కాపు కాస్తున్నారు. అలాంటి దారుణమే హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. ఇంట్లో పార్టీ ఉందని పిలిచి, స్టూడెంట్ పై ఇద్దరు లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 

అమానుషమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విందు పేరిట ఓ యువతిని ఇంటికి ఆహ్వానించి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఇద్దరు లెక్చరర్లపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపి న వివరాల ప్రకారం ఆల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి రాంగనర్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. మాదాపూర్ లోని చంద్రనాయక్ తండాలో నివాసముంటున్న కల్యాణ్ వర్మ ఇదే కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. తన ఇంట్లో విందు ఉందని చెప్పి కల్యాణ్ వర్మ ఆ యువతిని గతనెల 29న సాయంత్రం ఇంటికి ఆహ్వానించాడు.

అయితే తన సోదరుడితో కలిసి విద్యార్థిని వైస్ ప్రిన్సిపల్ ఇంటికి వచ్చింది. సోదరుడిని బయట ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్లిన యువతితో కాసేపు మాట్లాడిన తరువాత కల్యాణ్ వర్మ, అక్కడే ఉన్న మరో లెక్చరర్ రవీందర్ అనుచితంగా ప్రవర్తించి లైంగికంగా వేధించారు. 

వారి నుంచి తప్పించుకుని బయటకు పారిపోయిన యువతి ఈ నెల 9న రాత్రి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాదితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తన దృష్టికి రాగానే ఇద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించామని కళాశాల డైరెక్టర్ తెలిపారు.