ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడి మరోసారి అధికారానికి దూరమైన తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే బాటలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నడవనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.  ఆయన శుక్రవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. 

ఈ భేటీ అనంతరం సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ది పనుల గురించే కేటీఆర్ ను కలిసినటలు వెల్లడించారు. ఇక్కడ చెరువుల సుందరీకరణతో పాటు ప్రజల ఆస్తిపన్ను, రహదారులు, ట్రాఫిక్ సమస్యలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా చూస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని సుధీర్ రెడ్డి వెల్లడించారు.

అయితే ఆయన ప్రధానంగా టీఆర్ఎస్ లో చేరిక గురించి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే వుంటే భవిష్యత్ లేదని భావించిన అతడు టీఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఆయన నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్కరమాలు తననెంతో ఆకట్టుకుంటున్నాయంటూ సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. 

ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు చెందిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుండగా తాజాగా ఇప్పుడు సుధీర్ రెడ్డి కూడా అదే ఆలోచనతో వున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు అసలు ప్రాతినిధ్యమే కరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈ చేరికలను ప్రోత్సహిస్తోంది. 

మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ను వీడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, పాలేరు ఎమ్మెల్యే సురేందర్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమయ్యారు. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోడానికి సిద్దమై...అందుకోసం పలుమార్లు కేటీఆర్  తో మంతనాలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేటీఆర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.