కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. త్వరలో తెలంగాణలో కూడా పొలిటికల్ సర్జికల్ స్ట్రయిక్ ఉంటుందని, అది ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. 

బాహుబలి కేసీఆర్ మోడీ అణ్వస్త్రం ముందు నిలబడలేరని ఆయన శనివారం పెద్దపల్లిలో అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే సింగరేణిని కేసీఆర్ అమ్ముతారని ఆయన అన్నారు. 

సింగరేణి మనుడగ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆధార పడి ఉందని లక్ష్మణ్ అన్నారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన బిజెపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి అస్తులపై కేసీఆర్ కన్ను పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆర్టీసీకి పట్టిన గతే సింగరేణికి పడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు కండువా కప్పుకుని గెలిచిన నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకుని పునీతులవుతున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రామగుండం కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరాలని ఆయన అన్నారు.