తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు హత్యపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు.

ఇప్పటి వరకు 15 ఎఫ్‌ఎస్ఎల్‌ నివేదికలు అందాయని కోర్టుకు తెలిపింది. 15 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. మొత్తం 32 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Also Read:వామన్‌రావు హత్య: బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వాదనలు విన్న అనంతరం వామన్‌రావు హత్య దర్యాప్తు కేసు విచారణ జూన్ 4కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా, ఫిబ్రవరి 18న మంథని నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వామన్ రావు ఆయన భార్యను దారిలో అడ్డగించిన దుండగులు వీరిద్దరిని దారుణంగా హతమార్చారు. దీనిలో నిందితులు కుంట శ్రీను, చిరంజీవి సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వామన్ రావు బతికుంటే ఎప్పటికైనా సమస్యని కుంట శ్రీను, బిట్టు శ్రీనులు భావించారు. బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌పై కేసులు వేశాడు వామన్ రావు. గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి వామన్ రావు హత్యకు రెక్కీ నిర్వహించింది శ్రీను గ్యాంగ్. అయితే వామన్ రావు చుట్టూ జనాలు ఎక్కువగా వుండటంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

17న వామన్ రావు ఒంటరిగా దొరకడంతో హత్యకు ప్లాన్ గీశారు. హత్య తర్వాత బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి వామన్ రావు దంపతులు చనిపోయారని కుంట శ్రీను చెప్పాడు. మర్డర్ తర్వాత కుంట శ్రీను గ్యాంగ్‌ను మహారాష్ట్ర వెళ్లాలని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు.