భూ తగాదాలు ఓ కాంగ్రెస్ నాయకుడి హత్యకు దారి తీశాయి. శంకరపట్నం మండలం మెట్‌పెల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్‌ నాయకుడు రాచమల్ల సంపత్‌ హత్య చేయబడ్డాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మెట్‌పెల్లి గ్రామానికి చెందిన రాచమల్ల సంపత్‌కు భోనగిరి ఓదయ్య మధ్య భూగాదాలు ఉన్నాయి. ఇటీవల ఈ భూముల విషయంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయించారు. 

భూ తగాదాలు ఓ కాంగ్రెస్ నాయకుడి హత్యకు దారి తీశాయి. శంకరపట్నం మండలం మెట్‌పెల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్‌ నాయకుడు రాచమల్ల సంపత్‌ హత్య చేయబడ్డాడు. 
పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మెట్‌పెల్లి గ్రామానికి చెందిన రాచమల్ల సంపత్‌కు భోనగిరి ఓదయ్య మధ్య భూగాదాలు ఉన్నాయి. ఇటీవల ఈ భూముల విషయంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయించారు. 

పెద్ద మనుషుల సమక్షంలో శుక్రవారం పంచాయితీ ఉండగా గురువారం సంపత్‌ పొలం వద్దకు వెళ్లాడు.అక్కడ రాచమల్ల సంపత్, బోనగిరి ఓదయ్య ఘర్షణపడ్డారు. అక్కడే ఉన్న భోనగిరి ఓదయ్య కుమారుడు జంపయ్య వెనకనుండి గొడ్డలితో సంపత్ మెడ మీద నరికాడు. దీంతో సంపత్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. 

సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వీణవంక, ఇల్లందకుంట ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. హత్యకు గురైన సంపత్‌ తండ్రి రాజలింగం, కుటుంబసభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. 

భూతగాదాలతోనే సంపత్‌ హత్యకు గురయ్యాడని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. భూవివాదంలో కేశవపట్నం పోలీసులను ఆశ్రయిస్తే స్పందించకుండా ఓదయ్యకే వత్తాసు పలకడంతో మాటువేసి తన కొడుకును హత్య చేశారని మృతుడి తండ్రి రాజలింగం ఆరోపించారు. 
వీణవంక మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిపై ఆరోపణలు చేశారు. కేశవపట్నం స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి తండ్రి ఆరోపణలు చేయడంతో కేశవపట్నం ఎస్సై రవిని సంఘటన స్థలం నుంచి స్టేషన్‌కు పంపించడం గమనార్హం.