హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో దోస్తీ కట్టడం వెనక ఆంతర్యం బయటపడినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో మాదిరిగా మనం ముఖ్యమంత్రి కావచ్చుననే మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాటల్లోని ఆంతర్యం కూడా బోధపడినట్లు అనిపిస్తోంది. 

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తాజాగా మంగళవారం బయటపెట్టిన తన తాజా వివరాలను, దానికి కౌంటర్ గా టీఆర్ఎస్ నేత కేటీ రామారావు చేసిన ట్వీట్ ఆ విషయాలను తెలియజేస్తున్నాయి. గత నెల 20వ తేదీన లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను కేటీఆర్ కు పంపించారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా చెప్పారు. 

లగడపాటి మొదటి సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 65 నుంచి 70 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 60 సీట్లు అవసరం. అంటే, టీఆర్ఎస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ లభిస్తుందనే విషయాన్ని లగడపాటి తొలి సర్వే బయటపెట్టింది.

ఒక వేళ సర్వే ఫలితాలు కొంచెం అటూ ఇటూ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కూడగట్టుకోవడానికి కేసీఆర్ అసదుద్దీన్ తో దోస్తీ కట్టారనేది అర్థం చేసుకోవచ్చు. మజ్లీస్ కచ్చితంగా 7 సీట్లు గెలుచకుంటుందనేది అందరూ నమ్ముతున్న విషయం. మజ్లీస్ సభ్యులు ఏడుగురి మద్దతు తమకు లభిస్తే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆలోచించి ఉంటారు. అదే సమయంలో మైనారిటీ ఓట్లు పొందడానికి ఆ దోస్తీ పనికి వస్తుందని కూడా ఆయన భావించి ఉంటారు. 

మరో విషయానికి వస్తే, తమకు 100 సీట్లు వస్తాయని కేసీఆర్ ఢంకా బజాయిస్తూ చెబుతూ వచ్చారు. ఎన్నికలు సమీపించే నాటికి పరిస్థితిని మరింత చక్కదిద్దుకోవడానికి అవసరమైన సత్తా కేసీఆర్ కు ఉందని లగడపాటి వ్యాఖ్యానించినట్లుగా కేటీఆర్ చెప్పారు. పరిస్థితిని మెరుగుపరుచుకునే తన సత్తా సీట్లను 100 దాకా పెంచుతుందని కేసీఆర్ భావించి ఉండవచ్చు.  ఏమైనా, లగడపాటి తాజా సర్వే మాత్రం టీఆర్ఎస్ కు అధికారం దక్కడం కష్టమేనని తేల్చి చెబుతోంది.