హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో గెలిచే ముగ్గురు స్వతంత్ర్య అభ్యర్థుల పేర్లను ఆంధ్రా ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ తాజాగా మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు ప్రకటించారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి. వినోద్ గెలవబోతున్నట్లు లగడపాటి స్పష్టం చేశారు. 

అలాగే తెలంగాణలోని తొమ్మిది జిల్లాలలో నాలుగు  జిల్లాలలో ప్రజాకూటమి, మూడు జిల్లాలలో టీఆర్ఎస్, రెండు జిల్లాలలో ప్రజాకూటమి, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరు పోరు నడుస్తోందని తెలిపారు. 

ఇప్పటికే డిసెంబర్ ఒకటిన లగడపాటి రాజగోపాల్ విజయం సాధించే ఇద్దరు స్వతంత్రుల పేర్లు కూడా తిరుపతిలో ప్రకటించారు. నారాయణపేట నుంచి డికె శివకుమార్ రెడ్డి, బోథ్ లో అనిల్ కుమార్ జాదవ్ విజయం సాధిస్తారని ఆయన చెప్పారు 

ఇకపోతే ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం టీడీపీకి కేటాయించడంతో రంగారెడ్డికి టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన స్వతంత్రంగా బరిలో దిగారు. 

అటు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గడ్డం వినోద్. ఈయన టీఆర్ఎస్ రెబల్ గా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ప్రముఖ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాకా పెద్ద కుమారుడు. వీ6 ఛానెల్ యజమాని వివేక్ సోదరుడు. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ లభించకపోవడంతో ఆయన బిఎస్పీ నుంచి పోటీకి దిగారు. ఆయనను ఇప్పటికే టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది కూడా. 

ఇకపోతే మహమూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన జలంధర్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. అయితే టిక్కెట్ లభించకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందుతారని లగడపాటి తెలిపారు. 

ఇకపోతే జిల్లాల వారీగా ఆయా పార్టీల బలబలాలను ప్రకటించారు లగడపాటి. ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ప్రజాకూటమికి అనుకూల వాతావరణం ఉందని లగడపాటి తెలిపారు. అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో ప్రజాకూటమి, టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయని తెలిపారు. 

నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలలో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉందని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో ఎంఐఎం హవాకు ఎదురే లేదన్నారు. ఎంఐఎం హైదరాబాద్ లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు. మిగిలన స్థానాలను టీఆర్ఎస్, బీజేపీ, ప్రజాకూటమి పంచుకుంటాయని తెలిపారు. 

మెుత్తం జిల్లాల వారీగా బలబలాలు చూసుకుంటే నాలుగు జిల్లాలో ప్రజాకూటమి, మూడు జిల్లాలలో టీఆర్ఎస్, రెండు జిల్లాలో ప్రజాకూటమి, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని తెలిపారు. అయితే బీజేపీకి మాత్రం ప్లస్ అని చెప్పుకోవచ్చు. గతంలో కంటే ఈసారి జిల్లాలలో కూడా బీజేపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. 

అయితే తాము 119 నియోజకవర్గాలకు గానూ తమ సంస్థ 100 నియోజకవర్గాల్లో పర్యటించామని సర్వే చేపట్టామని తెలిపారు. అక్టోబర్ 28 నుంచి 45 రోజులపాటు తాము ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఈ సర్వేలో 1200 నుంచి 2000 శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు.

 ఆనాటి నుంచి ప్రజలను అడిగి తెలుసుకుని వారి నాడి ఆధారంగా సర్వేలు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రజానాడీ హస్తం వైపు ఉందన్నారు. అయితే గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి సీట్లు పెరుగుతాయన్నారు.   

పోలింగ్ శాతం తగ్గితే తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రజాకూటమికి అనుకూల అవకాశం ఉందని తెలిపారు. అయితే 68.5శాతం ఓటింగ్ నమోదు అయితే పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. 

మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు కూడా ఉన్నాయని అయితే వారిలో తన ప్రాణ స్నేహితులు ఉండటంతో వారి పేర్లు బయటపెట్టడం లేదని తెలిపారు. అలాగే మరో రెండు పేర్లు బుధవారం విడుదల చేస్తానని తెలిపారు. 

అయితే ముందస్తు ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణపై అందరి దృష్టి పడిందన్నారు. 
 
డిసెంబర్ 7 సాయంత్రం మెుత్తం ఎన్నికల సర్వే విడుదల చేస్తానని లగడపాటి తెలిపారు. తాను తెలంగాణలో పదిమంది స్వతంత్రులు గెలుస్తారని చెప్పానని అలాగే రోజుకు రెండు పేర్లు చొప్పున రిలీజ్ చేస్తానని చెప్పానని అందులో భాగంగా ఈ పేర్లు రిలీజ్ చేస్తున్ననట్లు తెలిపారు. 

అయితే తన పేరుతో వస్తున్న సర్వేలు తనకు సంబంధం లేదని లగడపాటి తెలిపారు. తాము ఆర్ జీ ఫ్లాష్ టీం బృందంతో సర్వే చేస్తున్నామని తాను మాత్రమే నేరుగా మీడియా ముందుకు వచ్చి చెప్తేనే అది తనదని నమ్మాలని కోరారు. తన టీంలో యర్రంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.