720 రూపాయల కోసం తలెత్తిన గొడవలో.. ఏ సంబంధం లేని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హయత్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ముందు జాతీయ రహదారి మీద తిప్పగల్ల సుభాష్ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అతను గురువారం రాత్రి హయత్ నగర్ బస్ డిపో సమీయంలోని మద్యం షాపుకు వెళ్లాడు.

అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. మందుకు రూ.720 కావాలని, ఏటీఎంకు వెళ్లి తీసుకొచ్చి ఇస్తామని అంతవరకు డబ్బులు ఇవ్వమని సుభాష్ ను అడిగారు. వారిని నమ్మిన సుభాష్ రూ. 720 ఇచ్చాడు. 

అయితే మందు కొనుక్కున్న వాళ్లు ఏటీఎంకు వెళ్లకుండా అక్కడే కాలయాపన చేస్తున్నారు. దీంతో చాలాసేపు ఎదురుచూసిన సుభాష్ ఆగ్రహించి వారిని కొట్టి స్కూటీని లాక్కొచ్చి పండ్లు విక్రయించే తోపుడు బండి వద్ద పెట్టాడు. 

అతని వద్ద దొడ్డి మధుసూదన్ రెడ్డి, ఆనంద్, నర్సింహలు పనిచేస్తున్నారు. స్కూటీ వీరికి అప్పజెప్పి సుభాష్ ఇంటికి వెళ్లిపోయాడు. డబ్బులు తీసుకున్నవాళ్లు వస్తే వారి దగ్గర రూ.720 తీసుకుని బండి ఇవ్వమని చెప్పాడు. అర్థరాత్రి 12.30గం.లకు సుభాష్ తో గొడవపడి దెబ్బలు తిన్న ముగ్గురు వ్యక్తులు తమ అనుచరులతో వచ్చి స్కూటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ధుసూదన్ రెడ్డి, ఆనంద్, నర్సింహలు డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో వారిమధ్య గొడవ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తోపుడు బండిమీదున్న కర్రలు లాక్కుని నర్సింహ, మధుసూదన్ రెడ్డి, ఆనంద్ లపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. 

ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి ముఖం, తలమీద కర్రతో దాడిచేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. నర్సింహకు కాలు విరిగింది. మృతుడు అనంతపురం జిల్లా నారాయణపురానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. అతనికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. 

మధుసూదన్ రెడ్డి గతంలో పెయింటర్ గా పనిచేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు.