హైదరాబాద్: కాంగ్రెసు నేతృత్వంలోని మహా కూటమిలో సీట్ల చిచ్చు రగులుతోంది. సీట్ల కేటాయింపులో కాంగ్రెసు జాప్యం చేస్తుండడం పట్ల భాగస్వామ్య పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ తో సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ సమావేశమయ్యారు.

సీట్ల పంపకంపై కాంగ్రెసు ఎటూ తేల్చడం లేదని కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు రోజుల్లో తేలుస్తామని కాంగ్రెసు అంటోంది.  నిజానికి, కాంగ్రెసు 90 సీట్లకు పోటీ చేయాలని అనుకుంటోంది. మిగిలిన 29 సీట్లను బాగస్వామ్య పక్షాలకు పంచాలనేది ఆ పార్టీ ఆలోచన.

అయితే, భాగస్వామ్య పక్షాలు ఎక్కువ సీట్లు అడుగుతుండడంతో కాంగ్రెసు ఆలోచనలో పడింది. రెండు, మూడు రోజుల్లో సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందని కోదండరామ్ చెప్పారు. దసరా నుంచి ప్రచారంలోకి దిగుతామని అన్నారు.