హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న కూన వెంకటేష్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు కేపీహెచ్ బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు సైతం కారెక్కేశారు. 

కూన వెంకటేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పోటీ చేసి ఓడిపోయారు. 

తాజాగా ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఇద్దరు నేతలను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువాకప్పుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చెయ్యాలని కోరారు.