2024 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్ధిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అనిల్ కుమార్ రెడ్డికి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య విభేదాలు నెలకొన్నాయి.
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సీఎం కేసీఆర్ బంపరాఫర్ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్ధిగా అనిల్ కుమార్ రెడ్డిని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అనిల్ కుమార్ రెడ్డికి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
2019లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు. దీంతో ఇక్కడ బీఆర్ఎస్‌కు బలమైన నేత కరువయ్యారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ రెడ్డి రాకతో కేసీఆర్‌కు ఊరట లభించినట్లయ్యింది. అంతేకాదు..అసెంబ్లీ ఎన్నికల నాటికి స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి అడ్డు రాకుండా ముందే ఎంపీగా టికెట్ కన్ఫర్మ్ చేయడం ద్వారా భువనగిరిలో తలనొప్పులు రాకుండా కేసీఆర్ చూసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అనిల్ కుమార్ రెడ్డి అభ్యర్ధిత్వం ఖరారైందా, లేక ఇది ప్రచారం మాత్రమేనా అన్నదానిపై క్లారిటీ రావాల్సి వుంది.
