Asianet News TeluguAsianet News Telugu

కూకట్ పల్లి కాల్పుల ఘటన : సినిమాను తలపించే ట్విస్టులతో దోపిడీ ప్లాన్..!!

కూకట్ పల్లి ఏటీఎం కాల్పుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చి, ఇక్కడ దోపిడీ దొంగల అవతారమెత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరాల బాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడింది, దోపిడీకి పాల్పడింది బీహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు.

kukatpally hdfc atm robbery case bihar gang - bsb
Author
Hyderabad, First Published May 1, 2021, 1:33 PM IST

కూకట్ పల్లి ఏటీఎం కాల్పుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చి, ఇక్కడ దోపిడీ దొంగల అవతారమెత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరాల బాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడింది, దోపిడీకి పాల్పడింది బీహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు.

కూకట్ పల్లి విజయ్ నగర్ కాలనీలోని ఎటిఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డు ను చంపి రూ. 5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు.

మరో నిందితుడు ఆయుధం డబ్బుతో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బీహార్కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల చందానగర్ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పని చేశారు.

తేలికగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు. నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్థలంలో ఓ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్‌ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్య నగర్ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ను టార్గెట్ చేశారు. గత నెల 16న రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో  దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్ షాప్ లోని రూ.1.95 లక్షలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నారు. 

అదే సమయంలో హెల్మెట్ మాస్క్ పెట్టుకున్న ఇద్దరు దుండగులు  దుకాణం లోకి ప్రవేశించి రవికుమార్కు తుపాకీ గురిపెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. డబ్బు తో పాటు సెల్ ఫోన్ తీసుకుని ఉడాయించారు. నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు.

కూకట్‌పల్లి కాల్పుల కేసు: నిందితుల అరెస్ట్... సరిహద్దులు దాటకుండానే పట్టేసిన పోలీసులు...

ఆ తరువాత కూకట్పల్లి ప్రాంతంలో ఏటీఎం కేంద్రాల పై గురి పెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బులు దోచుకోవడం సాధ్యంకాదని భావించి డబ్బులు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్ లతోపాటు.. నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కి చేసి.. విజయనగర్ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

అంతకుముందు జీడిమెట్లలో నేరం చేయడానికి తనకు పరిచయం అయిన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ విజయనగర్ కాలనీలో నేరం కోసం మాత్రం బైక్ ఉండాలని భావించారు. అందుకోసం  జోన్‌ పరిధి నుంచి ఓ పల్సర్ వాహనాన్ని చోరీ చేసి నెంబర్ ప్లేట్ తీసేసి వినియోగించారు.

విజయనగర్ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇద్దరిలో ఒక నిందితుడు వాహనాన్ని తీసుకుని లింగంపల్లి వరకు వెళ్ళాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి, డబ్బు. తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. 

ఎటిఎం కేంద్రంలోని  గ్లాస్‌ డోర్‌పై  నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్ లో సేకరించిన వేలిముద్రలతో సరిపోయాయి. అలా అనుమానితులను గుర్తించి, సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు.. బాలానగర్‌లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్ శ్రీనివాస్ ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు నేరుగా కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పర్యవేక్షిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios