చలికాలంలో కూడా తెలంగాణలో రాజకీయ వాతావరణం మంచి హీట్ మీదుంది. ఇప్పటివరకు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, రెబల్స్ గొడవ, బుజ్జగింపులు, ప్రచారం, పోలింగ్ ఇలా అనేక ప్రక్రియలను దాటుకుంటూ వచ్చిన పార్టీలు ఇప్పుడు తమ భవిష్యత్ రేపు ఎలా ఉండనుందో అని ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, ప్రజా కూటమి నాయకులు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి వారిలో ఫలితాలు ఎలా వస్తాయో అన్న భయం నెలకొంది. రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న సమయంలో అసలే వేడెక్కిన వాతావరణాన్ని తన ట్వీట్ తో ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ మరింత వేడెక్కించారు. 

''తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడానికి ఓ సరికొత్త పీఎం(మోది), ఆరుగురు ముఖ్యమంత్రులు, 11మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి(కేసీఆర్) వీరందరిని ఎదుర్కొని నిలిచారు. రేపు కేసీఆర్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకోనున్నారు'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ఇప్పటికే టీఆర్ఎస్ 100 కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ మరోసారి తన ట్వీట్ ద్వారా అదే విషయాన్ని చెప్పారు. రేపు టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేయడం ద్వారా ప్రత్యర్థి శిబిరంలో ఆందోళనను రేకెత్తించడానికి కేటీఆర్ ప్రయత్నించారు. ఇలా ఇరు పార్టీల నాయకులు మాటల యుద్దానికి రేపటితో తెరపడనుంది.