జనగామలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం మీద వెల్లువెత్తుతున్న విమర్శలకు కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. 2001నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్విటర్ వేదికగా రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెడుతోందని దీనికి కేసీఆర్ నాయకత్వమే కారణమంటూ రాష్ట్ర పట్టణాభివృధ్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి మహాత్మాగాంధీ చెందిన వ్యాఖ్యలను జోడించారు.
‘మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు..
తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు..
ఆ తరువాత మీతో కయ్యానికి కాలు దువ్వుతారు..
ఆ తరువాత మీరు విజయం సాధిస్తారు..’ మహాత్మాగాంధీ..
ఇలాగే మే 2001లో ‘కేంద్రాన్నిదారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అన్న కేసీఆర్ గారి audacious statementను ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు వెక్కిరించారు. ఎద్దేవా చేశారు. విరుచుకుపడ్డారు. కానీ నేడు దార్శనికుడైన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది... అంటూ 2001నాటి ఈనాడు పేపర్ క్లిప్ ను షేర్ చేశారు కేటీఆర్.
2001 మే 17న కరీంనగర్ లో జరిగిన సింహగర్జనలో కేసీఆర్ కేంద్రం మీద విరుచుకుపడి ప్రత్యేక తెలంగాణ సాధన గురించి ప్రస్తావించినప్పటి సంగతిని కేటీఆర్ నిన్నటి జనగామ బహిరంగ సభలో ప్రకటనతో గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం జనగామ జిల్లా పర్యటనలో కేసీఆర్ దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడ్డానికి సిద్ధమని.. సిద్ధిపేట వాళ్లు పంపిస్తే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్ధలు కొడతామని.. ఖబడ్దార్ మోడీ అంటూ సీఎం హెచ్చరించారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దేశం నుంచి నిన్ను తరిమేస్తామని.. మాకిచ్చే వాళ్లని తెచ్చుకుంటామని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మా జోలికి వస్తే నాశనం చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఊడుత ఊపులకు భయపడమన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని.. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తున్నామని.. ఏడాదికి రెండు మూడు లక్షల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలోని 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందుతుందని సీఎం హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లలో ఏనాడు కేంద్రంతో పంచాయతీ పెట్టుకోలేదని కేసీఆర్ గుర్తుచేశారు. అక్కడి నుంచి ఏం రాకున్నా వున్నంతలో అవినీతిరహితంగా ఒక పద్ధతిగా వెళ్తున్నామన్నారు.
