దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపారు. ఆయన జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో... తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అబ్దుల్ కలాం కి నివాళులర్పించారు. ప్రజలు మెచ్చిన ప్రెసిడెంట్, ప్రజా నాయకుడు అబ్దుల్ కలాం అని కేటీఆర్ పేర్కొన్నారు.  రక్షణ, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతగానో కృషి చేశాడోనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ఎంతో దూరదృష్టిగల నాయకుడని.. దేశం ఆయనను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. 

 

కాగా.. యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం ఎంతగానో కృషి చేసేవారు. ఆయన పలు సూక్తులు ఎందరిలోనో స్ఫూర్తి నింపాయి. కలాం జీవితం మొత్తం విశ్రాంతి లేకుండా పని చేశారు. తొలి విజయం సాధించాక ఆగిపోకండి.. మొదటిసారి గెలిచి, రెండోసారి ఓడితే.. తొలి విజయం అదృష్టవశాత్తూ వచ్చిందంటారు.. అని యువతకు కలాం సందేశాన్నిచ్చారు. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడని కలాం చెప్పిన సూక్తి యువతకు ఆదర్శం.