హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు బుధవారంనాడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు. ఆయనతో పాటు పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర  రెడ్డి తదితరులు జగన్ ను కలుస్తారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కసరత్తులో భాగంగా కేటీఆర్ జగన్ తో భేటీ అవుతున్నట్లు చెబుతున్నారు. జగన్ తో చర్చలు జరిపే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర రావు కేటీఆర్ కు అప్పగించారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను కలిసిన విషయం తెలిసిందే. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్, యాదవ్ మాత్రం తానే హైదరాబాదు వచ్చిన కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన నేపథ్యంలో ఎపిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ తో కేటీఆర్ మాట్లాడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన పాత్రపై కేటీఆర్ మాట్లాడుతారని అంటున్నారు.