హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం అంటే ఈనెల 17న ఉదయం 11.56 నిమిషాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 

కేటీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లా పంచాయితీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఆయన జిల్లాల వారీగా పర్యటనలు చేస్తారని తెలిపారు. 
 
రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యుల ఆలోచనలు, సలహాలు స్వీకరించామని తెలిపారు.డిసెంబర్ 26 నుంచి జనవరి 6వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని అందులో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అర్హులందరీ పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. 

జనవరిలో జరిగే గ్రామపంచాయితీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పంచాయితీ ఎన్నికల్లో ఎక్కువశాతం ఏక గ్రీవం అయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామని అందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు.  

మార్చి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అంతా పనిచెయ్యాలని కోరారు. ప్రతీ పార్లమెంట్ స్థానానికి ఒక ఇంచార్జ్, ఒక జనరల్ సెక్రటరీలను నియమిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో హెల్ప్‌డెస్క్, పబ్లిక్ గ్రీవెన్ సెల్ ను ఏర్పాటు చెయ్యనున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 

ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున కార్యవర్గం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారని తెలిపారు. ప్రజలకు మరింత సేవలు అందించేలా పార్టీ నిర్మాణం ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే అన్ని జిల్లాలో జిల్లా కార్యాలయాలు పూర్తి చెయ్యాలని ఆదేశించారు.