KTR On Sports Policy:  తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించాలని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదని, క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. క్రీడారంగంలో స‌మ‌గ్ర అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.   

KTR On Sports Policy: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క్రీడారంగంలో స‌మ‌గ్ర అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. న‌గరంలోని బేగంపేటలోని హారితప్లాజాలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, సబితా, ఎర్రబెల్లి హాజరయ్యారు. 

ఈ సమావేశంలో క్రీడాపాలసీలో రూపొందించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో క్రీడా విధానం దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని కేటీఆర్ తెలిపిన ఆయన కీలక మార్పులను సూచించారు. విద్యార్థి ద‌శ‌లో క్రీడాల ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు.

హైదరాబాద్‌లోని చాలా పాఠశాలలకు మైదానాలు లేవ‌నీ, పిల్లలను కోళ్ల ఫారాల్లో కోళ్ల లాగా కుక్కుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు, యాక్టర్లు, ఇంజినీర్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. అవసరమైతే.. క్రీడ‌ల‌ను ఓ సబ్జెక్ట్​గా చేర్చాల‌ని అన్నారు. ప్రాథమిక పాఠశాల నుంచే ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ లిటరసీని తప్పనిసరి చేయాలని కేటీఆర్ అన్నారు. 

రాష్ట్రంలోని నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్న ఒడిశాను సందర్శించాలని కేటీఆర్ అధికారులను కోరారు. పారా అథ్లెటిక్స్‌పై కూడా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడా పాలసీ తీసుకురావాలనీ, ఆ క్రీడా పాల‌సీ దేశానికే ఆదర్శవంతంగా ఉండాలనీ, ప్రభుత్వ లక్ష్యమన్న కేటీఆర్ అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తప్పనిసరన్నారు. 

క్రీడా సంస్థలు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. రాజకీయాలకు, క్రీడలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదని, క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పారు. కానీ, అసోసియేషన్లలో రాజకీయ నాయకులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. హరిత బడ్జెట్‌ తరహాలో పంచాయత్‌ రాజ్‌ నుంచి స్పోర్ట్స్‌ బడ్జెట్‌ను కూడా పెడతామని అన్నారు. అలాగే.. మహిళా కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. అన్ని ఆటలకు సంబంధించిన కమిటీలు ఏం చేస్తున్నాయని రాష్ట్ర ఒలింపిక్‌ కమిటీని నిలదీశారు.

ప్రైవేటురంగంలో స్పోర్ట్స్ వర్సిటీలను ప్రోత్సహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆటల పరికరాలు, మైదానాలు, స్టేడియాల నిర్మాణం జరగాలని ఆదేశించారు. అలాగే.. హాకీ, క్రికెట్ వంటి ఆటల మీద దృష్టి పెట్టాల‌ని, ఒక మోడల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సూచించారు.

సీఎం కేసీఆర్ కప్ పోటీలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించాలని ఆధికారుల‌కు క్రీడాశాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. క్రీడా పాలసీకి సంబంధించి పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతల సలహాలు సూచనలను తీసుకున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

వచ్చే మంత్రివర్గ సమావేశంలో క్రీడా పాలసీని ప్ర‌క‌టిస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు యోచిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎల్‌బి స్టేడియం, గచ్చిబౌలి వంటి స్టేడియాలను సాధారణ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చేయాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.