తోలు బొమ్మలు ఆ ముగ్గురు నేతలే.. ఆడించేది కాంగ్రెస్ హైకమాండ్: కేటీఆర్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 5, Sep 2018, 2:17 PM IST
KTR Speech in shadnagar
Highlights

పాలమూరు జిల్లాకు ఈ దుస్థితి పట్టడానికి కారణం కాంగ్రెస్ నేతలేనన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. షాద్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో  కలసి కేటీఆర్ ప్రారంభించారు. 

పాలమూరు జిల్లాకు ఈ దుస్థితి పట్టడానికి కారణం కాంగ్రెస్ నేతలేనన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. షాద్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో  కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంగట్లో అన్ని వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్లు.. పాలమూరు జిల్లా అభివృద్ది కాకపోవడానికి కారణం కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు.

పవన్‌కుమార్ రెడ్డి, విష్ణువర్థన్  రెడ్డి, హర్షవర్థన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న దానికి తోలు బొమ్మల్లా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. షా‌ద్‌నగర్‌ నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందని.. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డేనని అన్నారు.

తెలంగాణ వస్తే ఏదేదో జరుగుతుందని కొందరు నేతలు భయపెట్టారని.. తెలంగాణ వస్తే మొత్తం చీకటి అయిపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారని. కానీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని.. అంతేకాకుండా రైతులకు 24 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200గా ఇచ్చిన పెన్షన్‌ను రూ.1000కి పెంచామని.. రేషన్ బియ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోత పెట్టిందని.. మనిషికి ఆరు కేజీల చోప్పున ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం ఇస్తున్నామన్నారు. తన మనవడు, మనవరాలు ఏ సన్నబియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో భోజనం పెడుతున్న మనసున్న వ్యక్తి కేసీఆర్  అన్నారు.

షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ, గురుకుల పాఠశాలలు, గొర్రెల పథకం, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, రైతు బంధు, పంట భీమా వంటి పథకాలతో పేదవాడిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామన్నారు. ఉద్యమం సమయంలో కొందరు నేతలు ఆంధ్రా సోదరులను తప్పుదోవ పట్టించారన్నారు.

కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని.. టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో కూడా పెట్టాలని కోరుతున్నారని కేటీఆర్ తెలిపారు. తాము రాబోయే ఎన్నికల కోసం కష్టపడటం లేదని.. రాబోయే పది తరాల కోసం కష్టపడుతున్నామని అన్నారు. 
 

loader