తెలంగాణ పై జరుగుతున్న కుట్రలకు హైదరాబాద్ లోని ఎపి డిజిపి కార్యాలయం నిలయంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల పరిస్థితులు తెలుసుకోడానికి సర్వేల పేరుతో ఎపి ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారని తెలిపారు. వీరంతా హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కేవలం సర్వేలు చేస్తే తమకేమీ అభ్యంతరం లేదు కానీ భారీ ఎత్తున డబ్బుల పంపకానికి ఇప్పుడు ఈ పోలీసులు పనిచేస్తున్నట్లు ఆరోపించారు. అందుకు వారికి టిటిడిపి, కాంగ్రెస్ లు సహకరిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, టిడిపి కలిసి అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నాయకులు తమ వాహనాల ఇంజన్లలో, టైర్లలో, సీట్ల కింద డబ్బులు పెట్టుకొని దొరికిపోయారని ఎద్దేవా చేశారు. అందువల్లే భారీ ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తునట్లు తెలిపారు. 

 జగిత్యాల  జిల్లా ధర్మపురిలో టీఆర్ఎస్ కార్యకర్తలు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారని కేటీఆర్ తెలిపారు. పోలీసుల విచారణలో వారు ఎపి పోలీసులని తేలిందని తెలిపారు. వారిలో ఒకరు హెడ్ కానిస్టేబుల్ కాగా ఇద్దరు కానిస్టేబుల్లు ఉన్నారని తెలిపారు. వారి పేర్లు నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, మధుబాబు లుగా పోలీసులు గుర్తించారని అన్నారు. అన్నీ దృవీకరించుకున్న తర్వాతే ఈ వివరాలను బైటపెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే వీరు పట్టుబడ్డ అరగంటలోపే డిజిపి కార్యాలయంలో పనిచేసే ఎపి ఇంటలిజెన్స్ డీఎస్పీ బోస్ స్థానిక పోలీసులను బెదిరించి వారిని పిడిపించారని కేటీఆర్ వెల్లడింవచారు. ఇలా కుట్రలకు పాల్పడుతున్న వారిని నియంత్రించడానికే భారీగా పోలీసు తనిఖీలు జరుగుతున్నట్లు కేటీఆర్ వివరించారు.