Asianet News TeluguAsianet News Telugu

పార్టీకి ఓ క్రిమినల్ సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుంది: రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు. సొంతపార్టీ ఎంపీ, ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి నోరుపారేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ విమర్శించారు. ఇలాంటి క్రిమినల్‌కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని ట్వీట్ చేశారు. ట్వీట్‌కు జతచేసిన ఓ న్యూస్ క్లిప్‌లో శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి గాడిద అని దూషిస్తున్నట్టు ఉన్నది.
 

KTR slams TPCC chief revanth reddy over his remarks against shashi tharoor
Author
Hyderabad, First Published Sep 16, 2021, 1:49 PM IST

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శలు కురిపించారు. ఆయన ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని ఆరోపించారు. ఒక పార్టీకి మూర్ఖులు సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుందని ట్విట్టర్‌లో ఓ ఘటనను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ‘చీప్’ అని పేర్కొంటూ విమర్శలు చేశారు.

ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వ కృషిని మెచ్చుకున్నారని, ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ, పార్లమెంటులో ఆయన తోటి సభ్యుడు, పీసీసీ ‘చీప్’ ఆయనను గాడిద అని పేర్కొన్నారని ఓ న్యూస్ క్లిప్‌ను జత చేశారు.

 

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవలే హైదరాబాద్ పర్యటించారు. కేటీఆర్‌ కృషిని ప్రశంసించారు. ఆయన పర్యటనపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, శశిథరూర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే దుష్టజట్టు అని రేవంత్ విమర్శించారు. ఇరువురికీ ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నంతమాత్రానా మేధావులని భావిచనక్కర్లేదని అన్నారు. శశిథరూర్ ఒక గాడిద అని, కాంగ్రెస్ ఆయనను బహిష్కరిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

సొంతపార్టీ ఎంపీ, ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ శశిథరూర్‌నే టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని కేటీఆర్ ఇక్కడ ప్రస్తావించారు. ఇలాంటి థర్డ్ రేట్ క్రిమినల్ పార్టీకి సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios