హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ పవనాలు వీస్తే ఖమ్మం జిల్లాలో మాత్రం వీయలేదని కేవలం ఒక్కస్థానమే ఇచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానాన్నే దక్కించుకున్నామని రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరపలాడాలని అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కేసీఆర్ తనకు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇకపై తన దృష్టంతా ఖమ్మం జిల్లాపైనే ఉంటుందన్నారు. జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు అంతా కలిసి సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 
  
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి ముగించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుని 75శాతం సీట్లను సాధించామని స్పష్టం చేశారు. 

తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జోడెద్దులుగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చెయ్యని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ ఎలా అయితే అన్నారో నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో కరెంట్ సమస్య లేదని ఇక రాదన్నారు. అలాగే రెండు మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను అన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మరో 10 లక్షలు ఎకరాలకు సాగునీరు అందజేస్తామన్నారు. 

ఇప్పటికే మిసన్ భగీరథ 95 శాతం పూర్తైందని మిగిలిన 5శాతం పూర్తి చేసి ఇంటింటికి నీరందిస్తామన్నారు. అలా ఇంటింటికి నీరందించిన ఏకైక రాష్ట్రంగా తలంగాణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.