తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వేసుకున్న పింక్ ప్యాంట్ తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు.  ఇంతకీ మ్యాటరేంటంటే... ఆదివారం కేటీఆర్ ‘‘ ఆస్క్ మీ కేటీఆర్ ’’ పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కానీ వాటికి ముక్తసరిగా సమాధానాలిచ్చారు కేటీఆర్. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తనకు కూడా బాధగా ఉందన్న కేటీఆర్, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. తను కూడా ఓ తండ్రినేనని, తనకు కూడా బాధ ఉందని, ఇంతకంటే ఎక్కువగా స్పందించలేనని తెలిపారు. ప్రతి అంశంపై వెంటనే రియాక్ట్ అయ్యే మీరు, ఆత్మహత్యలు ప్రారంభమైన వెంటనే స్పందించి ఉంటే ఇన్ని సూసైడ్ లు జరిగి ఉండేవి కావనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇవ్వలేదు.

మరోవైపు ఏపీ ఎన్నికలపై మాత్రం తనదైన శైలిలో స్పందించారు. అయితే ఇక్కడ కూడా సూటిగా రియాక్ట్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రిగా రాబోతున్నారనే ప్రశ్నకు, గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరు సీఎం అవుతారంటూ ఓ జోకు పేల్చారు. అదే పనిగా ఏపీ ఎన్నికలపై ప్రశ్నలు రావడంతో తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పెద్దగా ఆసక్తిలేదంటూ ఆ డిస్కషన్ ను కట్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవికి కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అన్న ప్రశ్నకి... అది ఏపీ ప్రజలు తేల్చుకుంటారు అని పేర్కొన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ కి ప్రశ్నలు రాగా.. తాను ఆ వీడియో మొత్తం చూడలేదని...కాకపోతే.. అక్షయ్ వేసుకున్న పింక్ ప్యాంట్ మాత్రం బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. 

ఇక టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఓ నెటిజన్ కేటీఆర్ ని ప్రశ్నించారు. దానికి కేటీఆర్  'రీజనల్ రింగ్ రోడ్' అని ఫన్నీగా సమాధానం చెప్పారు.