ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ కి మంగళగిరి టీడీపీ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా.. టికెట్ కేటాయించిన నాటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. ప్రత్యర్థులను విమర్శిస్తూ.. ప్రజలను ఆకట్టుకోవాల్సిన లోకేష్.. మీడియా సాక్షిగా అభాసుపాలౌతున్నారు. ఇప్పటికే వివేకా హత్య విషయంలో.. ఎన్నికల పోలింగ్ తేదీ విషయంలో.. లోకేష్ చేసిన కామెంట్స్.. పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటఆడుకున్నారు.

తాజాగా.. ఆదివారం ఆయన చేసిన బందర్ పోర్టు( మచిలీపట్నం పోర్టు) కామెంట్స్.. నెట్టింట ఒకరేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఎంతలా అంటే.. లోకేష్ కామెంట్స్ ని ఓ నెటిజన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశారు. 

‘‘ ఈ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ కి ఓటు వేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే.. తెలంగాణకు మచిలీపట్నం పోర్టు తేవడంలో కేసీఆర్, కేటీఆర్ ఫెయిల్ అయ్యారు’’ అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా లోకేష్ కి కౌంటర్ గా చేసిన ట్వీట్ కి కేటీఆర్ స్పందించారు. నవ్వుతున్న ఎమోజీలను తన ట్వీట్ కి సమాధానంగా పెట్టారు.

తెలంగాణ సీఎం కేసీఆర్.. మచిలీపట్నం పోర్టును ఎత్తుకువెళ్లాలి అనుకుంటున్నారంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన సంగతి తెలిసిందే.