హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడదు లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలను తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు తప్పు పట్టారు. తన సర్వేలో వెల్లడైన ఫలితాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒత్తిడి ఫలితంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. 

టిఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయంటూ లగడపాటి రాజగోపాల్ తనకు గత నెల 20వ తేదీన మెసేజ్ పంపించారని అంటూ లగడపాటి పంపిన మెసేజ్ ను కేటీఆర్ ట్విట్టర్ లో  షేర్ చేశారు. కేవలం చంద్రబాబు కుట్రను ప్రజలకు తెలియజేసేందుకు లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను షేర్ చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

అయితే నవంబర్ 20 నాటికి ఆ పరిస్థితి ఉన్నదని, ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ  ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునే తీరు గురించి తనకు పూర్తి అవగాహన ఉన్నదని లగడపాటి అన్నారని,  తన అంచనాలకు మించి టిఆర్ఎస్ పార్టీ సీట్లు గెలుచుకున్నా తనకు ఆశ్చర్యం లేదన్నారని కేటీఆర్ వివరించారు.  ఇదే విషయం జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్ కు పంపిన మెసేజ్ లో తెలిపారు.