వరంగల్‌లో ఆక్రమణలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపుపై నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో ఇందుకు సంబంధించి కమిటీని నియమించారు.

వరదలతో దెబ్బతిన్న పనుల పునరుద్దరణకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఆక్రమణల తొలగింపుపై రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు  ఉండవని మంత్రి స్పష్టం చేశారు.

నాలాల ఆక్రమణల వల్లే రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయని.. నూటికి నూరు శాతం ఇది నిజమన్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు ఉపయోగించాలని... కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

నెల రోజుల్లోగా అన్ని ఆక్రమణలు తొలగించాల్సిందేనని, ఆక్రమణలైతే నిర్థాక్షిణ్యంగా తొలగింపులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. సీఎం ఆమోదంతో కొత్త వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.