హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎపిలో చంద్రబాబు ఓడిపోతారని తాము ముందే చెప్పామని ఆయన గుర్తు చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండడం వల్లనే వైఎస్ జగన్ గెలిచారని ఆయన అన్నారు. 

చంద్రబాబు పరాభవాన్ని తాము ముందే చెప్పామని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన నవీన్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోకసభ ఎన్నికల్లో తాము సీట్లు కోల్పోయినా కూడా ఆరు శాతం ఓట్లు పెంచుకున్నామని ఆయన అన్నారు. 

లోకసభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ట్రెండ్ ఈసారి కనిపించిందని ఆయన అన్నారు. ఆదిలాబాద్ లో బిజెపి గెలుస్తుందని ఆ పార్టీ వారు కూడా ఊహించలేదని ఆయన అన్నారు. వరస ఎన్నికల వల్ల పాలనలో జాప్యం ఉందేమో విశ్లేషించుకుంటామని ఆయన అన్నారు. 

నిజామాబాదు నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెసు ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ లో నామినేషన్లు వేసింది రైతులు కాదని, వారంతా నేతలేనని ఆయన అన్నారు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.