హైదరాబాద్: ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి ట్విట్టర్ వేదికగా సుమారు రెండు గంటలకు పైగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఏపీ రాష్ట్రంలో ఎవరు విజయం సాధిస్తారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏపీ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని కేటీఆర్ ప్రకటించారు.

ఏపీ నుండి ఎవరు సీఎం అవుతారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పాడు. పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేల నుండి ఎవరో ఒకరు సీఎంగా ఎన్నికయ్యే అవకాశం ఉందన్నారు. 

జగన్ సీఎం పదవికి అర్హుడని అనిపిస్తోందా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అయితే అది ఏపీ ప్రజలు నిర్ణయిస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో  తన అభిప్రాయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూశారా అని  ఓ నెటిజన్ ప్రశ్నిస్తే అవెంజర్స్ గురించి ఏమీ తెలియదన్నారు.  తన ప్రశ్నలకు  సమాధానం చెప్పకపోవడంతో  నారా లోకేష్ మీదొట్టు అంటూ ఓ నెటిజన్  చేసిన కామెంట్స్‌పై  కేటీఆర్ స్పందించారు. మధ్యలో లోకేష్ ఏం చేశాడు బ్రదర్ అంటూ ప్రశ్నించారు.

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో  మౌళిక సదుపాయాలపై ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

ఎంఎంటీఎస్ రెండో దశ కోసం నిధులు విడుదల కావడం లేదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. బీజేపీ ప్రచారాన్ని నమ్మకూడదని కేటీఆర్ చెప్పారు.ప్రశాంతంగా ఉండడంతో పాటు బుద్ది బలంతో వ్యవహరించడం కారణంగా కఠిన పరిస్థితుల్లో తనను తానుమ మోటివేట్ చేసుకొంటానని ఆయన తెలిపారు.

ఇంటర్ ఫలితాలపై కూడ ఆయన స్పందించారు. ఇంటర్ ఫలితాలపై ఇంకా  క్లారిటీ ఇవ్వాలో మీరే చెప్పండి సర్‌ అని ప్రశ్నించారు. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంపై తాను కూడ బాధపడుతున్నట్టుగా ఆయన చెప్పారు. తాను కూడ ఓ తండ్రినే.. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను తాను అర్ధం చేసుకోగలనని ఆయన చెప్పారు.