హైదరాబాద్: పురపాలన పూర్తిగా పౌరుల కేంద్రంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. పురపాలక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. 

పురపాలనలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పురపాలక చట్టాన్ని ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో జాబ్ చార్ట్ గా పరిగణించాలన్నారు. 

పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలలేమీ ఆశించడం లేదని, కేవలం వారి ప్రాథమిక అవసరాలు పౌర సేవలందిస్తే సరిపోతుందన్న భావంతో ఉన్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆదిశగా పని చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు.

 అధికార వికేంద్రీకరణే స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే స్పూర్తితో ప్రజలకు మరిన్ని పరిపాలన ఫలాలు అందాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు మంత్రి.

నూతన పురపాలక చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లైన్ సేవలు మరియు టెక్నాలజీ వినియోగం, గ్రీవెన్స్ రిడ్రెస్సెల్, ఎలాంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

 మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి కోరారు.నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలిక బడ్జెట్ లో కనీసం పది శాతంతో గ్రీన్ ప్రణాళిక రూపకల్పన చేయాలని పట్టణంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాల్సిందిగా కోరారు. 

ప్రతి పట్టణానికి శానిటేషన్ ప్లాన్ తో పాటు గ్రీన్ ప్లాన్ కూడా తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన హెల్త్ ప్లాన్ తయారుచేసి ఉంచాలన్నారు. ఇందుకోసం అవసరమైతే వెటర్నరీ డాక్టర్ లు, ఎంటమాలజిస్ట్ లు మరియు ఇతర సిబ్బంది సహకారం తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పౌరసేవలు అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక నూతన చట్టాలు చేస్తుందని మంత్రి ప్రస్తావించారు. అందులో భాగంగా పురపాలక శాఖలో తీసుకువస్తున్న టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో ప్రజలకి భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠినమైన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్లతో కేటీఆర్ అన్నారు. 

ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ అధికారైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అమలును హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మానిటర్ చేస్తామని ఆయన తెలిపారు.  

పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని, పౌరులతో సంబంధాలని పెంచుకునే విషయంలో మరింత చొరవ చూపించాలని కమీషనర్లను మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. 

ప్రజలతో కలిసి పని చేస్తూ వారికి అపూర్వమైన సేవలందించి పట్టణాలపైన తనదైన చెరగని ముద్ర వేసే తీరుగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో తమందరికీ ప్రజలే అంతిమ బాస్ లు అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అధికారులను కోరారు. 

వారితో బాధ్యతయుతంగా ఉండాలన్నారు.  నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. పురపాలనలో రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, వివిధ రంగాల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాయన్నారు.

ఈ సమావేశానికి పురపాలకశాఖ విభాగాధిపతులతోపాటు నూతన కార్పోరేషన్ల కమీషనర్లు, పురపాలక సంఘాల మున్సిపల్ కమీషనర్లు, హెచ్ యండిఏ, జీహెచ్ఎంసీ, 
టౌన్ ప్లానింగ్ సిబ్బంది హజరయ్యారు.