సిరిసిల్ల:  కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి పోలీసులు రాత్రీపగలు విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విధుల్లో వుండగా ఓ హోంగార్డు మృతిచెందాడు. కఠిన సమయంలో ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు  కోల్పోయిన సదరు పోలీస్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. 

సిరిసిల్లలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య (50) అనే హోంగార్డు హఠాన్మరణం పొందాడు.  అతడి మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలియజేశారు. వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థికసహాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 

 సిరిసిల్ల పోలీస్‌ ష్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న దేవయ్యకు భార్య భారతి, కూతురు నవ్య, కొడుకు సాయిప్రకాష్  ఉన్నారు. కోర్డు డ్యూటీ నిర్వహించే అతడు కోర్టుకు సెలవులు ప్రకటించడంతో లాక్‌డౌన్‌ విధుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నాడు. బుధవారం పెట్రోలింగ్‌ విధుల్లో కానిస్టేబుల్‌తో కలిసి దేవయ్య విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో సిరిసిల్లలోని ఎల్లమ్మ చౌరస్తాలో సొమ్మసిల్లి పడిపోయాడు. 

అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు దేవయ్యను వెంటనే సిరిసిల్ల ఏరియా దవఖానకు తరలించారు. అయినా ఫలితం లేకుండా అతడు మృతిచెందాడు.  లాక్‌డౌన్‌ విధుల్లో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.