హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం నుండి నయా పైసా కూడా రాలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.ఆరున్నర ఏళ్లలో కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.మంగళవారం నాడు అసెంబ్లీలో ఆయన ఈ విషయమై ప్రకటన చేశారు.తెలంగాణకు కేంద్రం నుండి గుండు సున్నా మాత్రమే వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. 

కరోనా సమయంలో కేంద్రం  రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్టుగా  చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఈ ప్యాకేజీ ఏమైందో  తెలియదన్నారు. ఈ ప్యాకేజీతో పారిశ్రామికవేత్తలకు కూడ ప్రయోజనం కలగలేదని తనకు వ్యాపారులు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

వీధి వ్యాపారులకు కొంత రుణం చెల్లించారని ఆయన చెప్పారు. పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీ ఇస్తామని ఇచ్చిన హామీని కేంద్రం అమలు చేయలేదన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాలను కనీసం కేంద్రం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.