హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

తన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ కు ట్యాగ్ చేశారు. మీ వ్యాఖ్యలు మీ ఆలోచనలు సరైనవి కావనే విషయాన్ని తెలియజేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ 29 రాష్ట్రాల ప్రజలకు సొంత ఇల్లు, వారంతా రాష్ట్రావిర్భావం నుంచి సామరస్యంగా జీవిస్తున్నారని మీకు తెలుసు అని ఆయన అన్నారు. 

మీరు నాతో ఏకీభవిస్తారని నాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు అవాంఛనీయమైన ప్రతికూలతలను కల్పిస్తాయని కేటీఆర్ అన్నారు.