తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ నిరాడంబరతను చాటుకుంటున్నారు. సామాన్య ఓటర్లతో కలిసి క్యూలో ఓపిగ్గా నిల్చుని తమ సమయం వచ్చాక ఓటేసి వెళుతున్నారు. ఇప్పటివరకు ఇలాగే చాలమంది సెలబ్రిటీలు, నాయకులు ఓటేసారు. ఇదే మాదిరిగా ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ కూడా క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బంజారా హిల్స్ పోలింగ్ కేంద్రంలో  ఓటేయడానికి కేటీఆర్ క్యూలో నిల్చున్నారు.అందరు ఓటర్ల మాదిరిగానే తన సమయం వచ్చే వరకు క్యూలో వేచివుండి ఓటేశారు. ఆయన సోదరి కవిత కూడా నిజామాబాద్ లో ఇదే మాదిరిగా క్యూలో నిల్చుని ఓటేశారు. 

ఇక ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భార్యా, కుమారులతో కలిసి వచ్చిన ఆయన అజాంపుర పోలింగ్ బూత్ లో ఓటేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖులందరు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సినీచ క్రీడా ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిల్చుని మరి ఓటేస్తున్నారు. 

ఇవాళ ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఉదయం 11 గంటల వరకు  23 శాతం ఓట్లు పోలైనట్టుగా  ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల  చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. అలాగే మరికొన్ని చోట్ల గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీల ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే అన్నిచోట్లా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.