హీరో రామ్ చరణ్ తెలుసా..?బుడ్డోడికి కేటీఆర్ ప్రశ్న.. వీడియో వైరల్
ఇంతకీ మ్యాటరేంటంటే...కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్‌లోని రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లలో గురువారం మంత్రి కేటీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటెన్న్మెంట్ జొన్లను సందర్శించిన మంత్రి అక్కడి ప్రజలతో మాట్లాడారు.
కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్... కరోనా వైరస్ పట్ల అవగాహన ఉందా..?, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలు, ఇతర సమాచారం మీకు చేరిందా అని అడిగి తెలుసుకున్నారు.
మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు.
కరొనా వ్యాప్తి, కంటైన్ మెంట్ జోన్ల పరిమితులు, నిబంధనల పైన పూర్తిగా అవగాహన ఉన్నవారు తమ పక్క న ఉన్న వారికి మరింత అవగాహన కల్పించి ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని కోరారు.
ఇందులో భాగంగా ఓ ఇంటి వద్ద ఆయన ఆగి.. ‘‘అందరూ బాగానే ఉంటారు.. ఎవ్వరూ బయటికి వెళ్లకండి. మూతికి మాస్క్ వేసుకునే బయటికి వెళ్లాలి. మే 3 తారీఖు వరకు.. ఆ తర్వాత ఏమిటనేది తర్వాత చెబుతాం. పిల్లలు ఇంట్లోనుంచి కదులుతున్నారా? పోనియకండి. నీ కొడుకా..? ఏం పేరు.. అని అడుగగా.. (పిల్లాడు రామ్ చరణ్ అని సమాధానం ఇస్తే..), అవునా.. ఆ రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా..?’’ అని సరదాగా కేటీఆర్ వారితో సంభాషించారు. ఇప్పుడీ వీడియోని మెగా అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.