జూబ్లీహిల్స్: హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. రెండు రోజులుగా రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో యూసఫ్ గూడ రోడ్ షోలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ను గెలిపించాలని కోరారు. 

హైదరాబాద్ మహానగరాన్నిసీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని కేటీఆర్ అన్నారు. సీఎం కుర్చీ కోసం హైదరాబాద్ లో మతకల్లోలాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఏ మెుఖం పెట్టుకుని ఓట్లు అడటానికి వస్తున్నారో కాంగ్రెస్ పార్టీని నిలదీయ్యాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. 

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేసిందని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే  కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల తెలంగాణ ఏర్పడితే  ఏదో జరుగుతుపోతుందని చెప్పిందని కానీ నాలుగున్నరేళ్ల కాలంలో అవన్నీ తప్పని పటాపంచలు చేశామన్నారు. 

ఆనాటి కాంగ్రెస్ పార్టీ కరెంట్ కట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దని మళ్లీ టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ గెలిస్తే పెన్షన్లు డబుల్ అవుతాయని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా రంగస్థలం సినిమా గురించి ప్రస్తావించారు కేటీఆర్. తాను ఈ మధ్యనే రంగస్థలం సినిమా చూశానని ఆ సినిమాలో నాగన్న ఆగట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అంటూ పాట ఉందంటూ చెప్పుకొచ్చారు. 

ప్రజాసంక్షేమం ఒకవైపు, అవినీతి పాలన మరోవైపు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆగట్టున రాష్ట్రాన్ని దోచుకు తిన్న కాంగ్రెస్,టీడీపీ తోడు దొంగలు ఉన్నారు ఈ గట్టున  కేసీఆర్ పంపిన మాగంటి గోపీనాథ్ ఉన్నారు ఏగట్టున ఉంటారో తేల్చుకోవాలని కేటీఆర్ చెప్పారు. 

ఆగట్టున కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ టీడీపీలు ఉన్నాయని ఈ గట్టున అడగకుండానే 24 గంటలు కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. ఆగట్టున నీళ్లడిగితే తిట్టారని కానీ ఈ గట్టున ప్రతీ ఇంటికి నీరిచ్చి ఆడపడుచుల కన్నీళ్లు తుడిచే పార్టీ ఉందన్నారు. 

ఆ గట్టుమీద రూ.200 పెన్షన్ ఉంది ఈ గట్టున రూ.2000 పెన్షన్ ఉందని కేటీఆర్ తెలిపారు. ఆ గట్టున సంక్షోభం ఉంటే ఈ గట్టున సంక్షేమం ఉందని ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని కోరారు. ఆ గట్టున డబ్బై ఇళ్లు ఉంటే ఈ గట్టున డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. 

లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామని కాస్త ఓపికతో ఉండాలన్నారు. మంచి పని చేసేటప్పుడు కాస్త ఆలస్యం అవుతుందని ప్రతీ ఒక్కరూ కాస్త ఆలోచించాలని కోరారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్ని ఇళ్లు కట్టించేందుకు అయినా టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ పార్టీని గెలిపించాలని మళ్లీ అధికారం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కేటీఆర్ రోడ్ షోలో టీఆర్ఎస్ లొల్లి: అలిగి వెళ్లిపోయిన అభ్యర్థి మాగంటి