ముందస్తు ఎన్నికలంటే విపక్ష నేతలకు భయం పట్టుకుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.  ఎన్నికలు ఎప్పడు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటిందని గుర్తు చేశారు. 

అధికారంలో ఉన్నవారు పదవులను వదిలిపెట్టేందుకు భయపడతారని తాము అలా కాదని తెలిపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను వదిలేసిన ఘనత టీఆర్ఎస్ కే చెల్లుతుందని తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని తెలంగాణ రాజీనామాల సమితి అని కూడా చెప్పుకున్నారని గుర్తు చేశారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడులాంటి వారు ఉన్నారని విమర్శించారు. 

మరోవైపు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడిస్తామని పదేపదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ముందస్తు ఎన్నికలంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. పైకి టీఆర్ఎస్ ను ఓడిస్తామని చెప్తున్నా ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ఇంకా ఆరు నెలలు ఉండగా ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించడం చూస్తే వారి భయం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. 

ఒక వైపు కేసీఆర్ ను ఓడించాలని చెప్తూనే మరోవైపు టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని రాయబారాలు నడుపుతున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పై అవాక్కులు చెవాక్కులు పేలుతున్న కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూడాలన్నారు.కేసీఆర్ కు అద్భుతమైన పరిణితి ఉందని సాక్షాత్తు దేశప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని...అలాగే కేసీఆర్ గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కితాబిచ్చారని తెలిపారు.  

రాబోయే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని కేటీఆర్ కోరారు. మరోవైపు తాను బచ్చా అన్నా రాహుల్ గాంధీ ఆయన ఏంటని ప్రశ్నించారు. కుటుంబ పాలనపై రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 2006 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ప్రజలు గెలిపిస్తేనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లాను...పదవులను సైతం వదులకున్నామని స్పష్టం చేశారు. ఇకపోతే సంచులతో డబ్బులు పంచడం కాంగ్రెస్ నేతలకే తెలుసునని టీఆర్ఎస్ కు తెలియదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో నోట్ల కట్టలతో ఎవరు దొరికారో అందరికి తెలుసునంటూ విమర్శించారు.