ముఖ్యమంత్రి ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (CMSTEI) స్కీమ్ కింద ఏర్పాటైన యూనిట్లకు మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులో మినహాయింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (CMSTEI) స్కీమ్ కింద ఏర్పాటైన యూనిట్లకు మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులో మినహాయింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే గిరిజన ఉన్నత విద్యావంతులకు సీఎంఎస్టీఈఐ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు సీఎంఎస్టీఈఐ యూనిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని కులమతాల మధ్య గీతలను కరోనా చెరిపివేసిందన్నారు. అందరం ఒక్కటేనన్న మాట అప్పుడు అర్థమైందని చెప్పారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే కులవ్యత్యాసాలు రూపుమాసిపోతాయన్నారు. ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎటువంటి సందేహాలకు లోనుకావద్దని.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చైనా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి అత్యుత్తమ దేశాలతో పోటీపడుతుండగా.. భారత్ మతపరమైన విధ్వంసాలతో సతమతమైందని కేటీఆర్ అన్నారు. నిన్న తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏదేదో మాట్లాడరని విమర్శించారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో తెలంగాణ కంటే మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ పాలిత రాష్ట్రం పేరు చెప్పమని సవాల్ విసిరినప్పుడు వారు మౌనంగా ఉన్నారని అన్నారు. అమిత్ షా ఒక పొలిటికల్ టూరిస్ట్ అని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే రాజకీయ పర్యాటకులు ముఖ్యమంత్రిని అధికారం నుంచి దింపడానికి అవకాశాలు వెతుకుతున్నారని అన్నారు. మీ దేవుడు గొప్పా..? మా దేవుడు గొప్పా? అనే చర్చ వద్దని.. అభివృద్దే లక్ష్యం కావాలని కేటీఆర్ అన్నారు.
