తెలంగాణ ఇచ్చింది అమ్మ కాదు.. బొమ్మ కాదు: కేటీఆర్

KTR blames Congress for the merger
Highlights

ఆంధ్రకు, తెలంగాణకు బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసు పార్టీయేనని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్: ఆంధ్రకు, తెలంగాణకు బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసు పార్టీయేనని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు వ్యాఖ్యానించారు.  తెలంగాణ భవన్ లో ఆర్య వైశ్యులు ఆయన సమక్షంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అమ్మ కాదు.. బొమ్మ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కృషితోనూ వందలాది మంది బలిదానాలతోనూ తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం ఇంతా అంతా కాదన్నారు.
 
ఇంటింటికీ నీళ్లివ్వడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్సోళ్ల కిందకు కూడా నీళ్లు తెచ్చుడు పక్కా అని వ్యాఖ్యానించారు. ఇంకో 15 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు. 

ఎన్నికల కాలం వచ్చిందంటే గాలి మాటలు వినిపిస్తాయన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులు వస్తారని అన్నారు. అవసరం అయితే ఇంటింటికీ తులం బంగారం కూడా ఇస్తామంటారు,ఇలాంటోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా చిత్త శుద్ధితో చేస్తారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దేశంలో ఇంకా వేలాది గ్రామాలకు కరెంట్ లేదని, తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతి పాలు చేసిందని విమర్శించారు 


వనరులున్నా దేశం అభివృద్ధి చెందలేదని అన్నారు. 1969 ఉద్యమంలో తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని అన్నారు.విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. అగ్రకులాల్లోనూ పేదలు చాలా మంది ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

loader