Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కీలక అడుగులలో కేటీఆర్ మిస్సింగ్.. మరోసారి దూరంగానే.. కారణం అదేనా..?

భారత రాష్ట్ర సమితితో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ.. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ మాత్రం పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన బహిరంగ వేదికలపై కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

KTR Away from bts first public meeting to held in khammam ksm
Author
First Published Jan 18, 2023, 12:03 PM IST

భారత రాష్ట్ర సమితితో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ.. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ మాత్రం పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన బహిరంగ వేదికలపై కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఢిల్లీలో పార్టీ  కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించిన కేసీఆర్.. తాజాగా నేడు ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరుకానున్నారు. ఐదు లక్షల జనసమీకరణతో సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు గత కొద్ది రోజులుగా ఖమ్మంలోనే మకాం వేశారు.

ఈ విధంగా దేశ రాజకీయాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌ కీలక అడుగులు వేస్తున్న సమయంలో..  కేటీఆర్ వాటికి దూరంగా ఉండం సొంత పార్టీతో  పాటు, రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్ పేరు మార్పుకు ముందు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. పార్టీలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ పేరు మార్పు తర్వాత మాత్రం.. కీలక కార్యక్రమాలలో మాత్రం కనిపించడం లేదు. 

Also Read: ఏపీలో ఎంట్రీకి రెడీ.. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ బహిరంగ సభ!.. భారీగా చేరికలు..?

ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఆ సందర్భంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళితే.. కేటీఆర్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ముందుగా  నిర్ణయించిన వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల కేటీఆర్ హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి మించిన ముఖ్యమైన పని ఏముంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

ఇక, ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంలో కూడా కేటీఆర్ కనిపించలేదు. తాజాగా ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు కూడా కేటీఆర్ గైర్హాజరు అవుతున్నారు. ఈ నెల 14న ఆయన నేతృత్వంలోని తెలంగాణ బృందం వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొని.. పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ వెళ్లింది. వారం రోజుల పాటు ఈ బృందం అక్కడే ఉండనుంది. దీంతో ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభకు కూడా కేటీఆర్ దూరంగా ఉండనున్నారు. 

వరుసగా ఇలాంటి ఈ పరిణామాలే చోటుచేసుకోవడంతో.. బీఆర్ఎస్‌ కార్యక్రమాలకు కేటీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనుకోకుండా ఇలా జరుగుతుందా..?, లేకపోతే కావాలనే కేటీఆర్ దూరం జరుగుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత మాత్రం బీఆర్ఎస్ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. భారత జాగృతితో బీఆర్ఎస్‌కు మద్దతుగా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా కూడా ప్రకటించారు. మరోవైపు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు. 

ప్రస్తుతం కేసీఆర్.. బీఆర్ఎస్ అధినేతగా ఉండగా.. తెలంగాణలో పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. కేటీఆర్‌ను తెలంగాణ బీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమిస్తారనే చర్చ గతంలో జరిగింది. అయితే ఇప్పటివరకు దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ విషయంలో కేటీఆర్ ఏమైనా అసంతృప్తితో ఉన్నారా? అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరోవైపు ఏపీ నేతలు కొందరు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతోనే అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడం గమనార్హం.

అయితే బీఆర్ఎస్ బహిరంగ కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండటం మరో కారణం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. బీఆర్‌ఎస్ అనేది పెద్ద బాధ్యత అని, పార్టీ పేరు మార్పు వల్ల మద్దతుదారుల నుంచి సానుకూలత విషయంలో ఇబ్బంది ఉండొచ్చని కేటీఆర్ భావిస్తున్నారని అందుకే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆ ప్రచారం సారాంశం. మరి ఇందులో నిజమెంత? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కేటీఆర్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios