Asianet News TeluguAsianet News Telugu

బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రులు.. ఆ విషయంలో అధికారుల సమాధానంపై కేటీఆర్ అసహనం..

బాసర ట్రిపుల్ ఐటీ అధికారుల తీరుపై ఐటీ, పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని చెప్పారు.

KTR Attends Basara IIIt convocation and Asks Officials on Implementation of promises
Author
First Published Dec 10, 2022, 11:32 AM IST

బాసర ట్రిపుల్ ఐటీ అధికారుల తీరుపై ఐటీ, పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ల్యాప్‌ట్యాప్‌లు, యూనిఫామ్‌ అందజేశారు. అంతకుముందు కాన్ఫరెన్స్ హాల్‌లో ట్రిపుల్ ఐటీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతంలో తాను బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించిన సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. 

అయితే మెస్ కాంట్రాక్ట్‌ మార్పు విషయంలో అధికారులు ఇచ్చిన సమాధానంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించడానికి టెండర్లు పిలవడం అంతరిక్ష సమస్యనా అని ప్రశ్నించారు ఎవరైనా ఓవర్‌యాక్షన్ చేస్తే పోలీసులు సాయం తీసుకోవాలని సూచించారు. పిల్లల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మిగిలిన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ ఎప్పటిలోగా అవుతుందని అడిగి తెలుసుకున్నారు. ఆడిటోరియంలో సిట్టింగ్‌కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే సిట్టింగ్‌ను మార్చినట్టుగా అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇక, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కొత్త అడ్మిన్ బ్లాక్‌కు సంబంధించి అప్రూవల్స్‌పై వివరాలు అడిగి తెలసుకున్నారు. 

ఇక, బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లేముందు  కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘రెండు నెలల క్రితం మా పర్యటనలో మేము ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చిన తర్వాత ఈ రోజు.. కాన్వకేషన్‌కు హాజరై విద్యార్థులతో సమావేశమయ్యేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తున్నాం. సంస్థ, విద్యార్థులకు ఇచ్చిన ప్రతి కమిట్‌మెంట్‌ను అందించడానికి ఎదురు చూస్తున్నాం’’ అని కేటీఆర్ ట్విట్ చేశారు.

ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్‌ ఐటీ  నెలకొన్న సమస్యలపై కొన్ని నెలల కిందట విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రులు  కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు.. ఈ ఏడాది  సెప్టెంబర్ నెలలో బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించారు. ఈ సందర్బంగా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. 

హాల్‌లో విద్యార్థులు కింద కూర్చొవడం తనకు నచ్చలేదని అన్నారు. ఆడిటోరియంలో ఫిక్స్‌డ్ చైర్‌లు మాదిరిగా హాల్‌లో చైర్‌లను ఏర్పాటు చేయాలని వీసీకి  సూచించారు. ఇందుకోసం అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. మళ్లీ వచ్చేనాటికి హాల్‌లో అందరూ పైన కూర్చొనేలా చూడాలని వీసీని కోరారు. 

హాస్టల్ కష్టాలు తనకు కూడా తెలుసని.. పాతుకుపోయిన వ్యవస్థలను మార్చడానికి టైమ్ పడుతుందని అన్నారు. ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు కూడా తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. రెండు నెలల తర్వాత  తాను మళ్లీ వస్తానని.. అందరికీ ల్యాప్ ట్యాప్‌లు ఇస్తానని చెప్పారు. శాంతియుతంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు కూడా నచ్చిందని.. అయితే ప్రభుత్వంలో ఉన్న తాను ఈ మాట చెప్పకూడదని అన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లడమే తప్ప.. వేరే ఏజెండా లేకుండా ఉద్యమం నడిపిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.  మెస్‌లలో నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios