హైదరాబాద్: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2020-21 సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు కృష్ణా నది జలాలు కేటాయింపుతో పాటు కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు.

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును ప్రతిపాదించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే తెలంగాణలోని మహాబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు శాశ్వతంగా ఎడారిగా మారే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్రం వాదిస్తోంది.

మరో వైపు తెలంగాణ ప్రభుత్వం  నిర్మించిన తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు , డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై కూడ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ప్రాజెక్టు నిర్మాణాలను చేపడుతోందని ఏపీ వాదిస్తోంది.

ఈ మేరకు రెండు రాష్ట్రాలు తమ వాదనలతో ఇప్పటికే కృష్ణా బోర్డుకు కూడ ఫిర్యాదు చేశాయి. ఈ విషయమై ఇప్పటికే రెండు రాష్ట్రాలు తమ వాదనలను బోర్డు ముందు విన్పించాయి.

బోర్డు కార్యదర్శిగా ఉన్న పరమేశం ప్రస్తుతం బోర్డు ఛైర్మెన్ గా బాద్యతలు స్వీకరించారు. పరమేశం బోర్డు ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరుగుతోంది.

also read:తాగు నీటికి ఏపీకి 2 టీఎంసీలకు తెలంగాణ ఒకే: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటి నిర్ణయం

కృష్ణా బోర్డును ఏపీ రాష్ట్రంలోని విజయవాడకు తరలించాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. అంతేకాదు బోర్డు నిర్వహణకు సంబంధించిన నిధుల  విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్వహణపై  అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. 

కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ వాదనను సమర్ధవంతంగా వినిపించాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు దిశా నిర్ధేశం చేశారు.