కరోనాతో కొత్తగూడెం డిఎంహెచ్వో మృతి... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సర్కార్
కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నరేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది.
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నరేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. గతంలో ఇచ్చిన హామీమేరకు నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వం ఉద్యోగానికి సంబంధించిన పత్రాలు అందించారు. ఇవాళ(ఆదివారం) గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగానికి సంబంధించిన కాపీని మంత్రి పావనికి అందించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఈ ఉద్యోగం ఇప్పించారన్నారు. కాబట్టి కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
వైద్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవతా కోణంలో ఆలోచించి తనకు గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చినందుకు డాక్టర్ నరేష్ భార్య పావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కి ధన్యవాదాలు తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో పావని తండ్రి సత్యనారాయణ, పిల్లలు సంజని, శరణి తో పాటు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డా కత్తి జనార్ధన్, సెక్రెటరీ జనరల్ డా పూర్ణచందర్, వైస్ ప్రెసిడెంట్ డా రాంబాబు, సెక్రేటరీలు డా ప్రవీణ్, డా కిరణ్ లు ఉన్నారు.