తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడప్పుడే వలసల పర్వం ఆగేలా లేదు. ఆ పార్టీ నుండి బయటి వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ వలసలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొనసాగుతూనే వున్నాయి. అసలు లోక్ సభ ఎన్నికలు ముగిసే సరికి తెలంగాణలో కాంగ్రెస్ ఉనికే ఉండదేమో అన్నంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతుండగా అందులోకి తాజాగా మరో ఎమ్మెల్యే  చేరారు. 

ఇప్పటికే ఖమ్మం జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమయ్యారు. వారితో పాటు తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర  రావు కూడా టీఆర్ఎస్ గూటికి చేరడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. 

శుక్రవారం వనమా తన  కుమారులతో కలిసి ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరు ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ జిల్లా నుండి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దపడగా వనమా కూడా కేటీఆర్ ముందు అందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. వనమా పార్టీలో చేరితే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం టీఆర్ఎస్ బలం మరింత పెరిగే అవకాశం వుంది... కాబట్టి కేటీఆర్ కూడా ఆయన్ను సాదరంగా స్వాగతించడానికి కేటీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాపై పట్టు సాధించలేకపోయిన టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇలా ఖమ్మం లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. దీనికోసం ఇప్పటికే టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నుండి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దపడగా తాజాగా ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కూడా అందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేల చేరిక విస్తృతంగా జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, నల్గొండ జిల్లా నుండి చిరుమర్తి లింగయ్య, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి జాజుల సురేందర్, సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుండి ఆత్రం సక్కు, రేగా కాంతారావులు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దంగా వున్నట్లు సమాచారం. ఇందులో కొందరయితే తాము కాంగ్రెస్ ను వీడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.