తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసినా ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద ఇంకా వేధిస్తూనే ఉంది. నామినేషన్లు వేయడానికి నిన్న(19వ తేదీ) చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు నమోదయ్యాయి. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియలో కొన్ని స్థానాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా జగిత్యాల జిల్లాలో ఓ అభ్యర్థితో కలిసి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న టిటిడిపి అధ్యక్షులు ఎల్.రమణకు చేదు అనుభవం ఎదురయ్యింది. 

జగిత్యాల జిల్లా కోరుట్లలో మహాకూటమి తరపున మాజి మంత్రి తనయుడు జువ్వాడి ర‌త్నాక‌ర్ రావు కొడుకు న‌ర్సింగరావు బరిలోకి దిగనున్నారు.ఈ  మేరకు ఆయన అభ్యర్థిత్వం  ఖరారయ్యింది. అయితే ఇదే స్థానం నుండి మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిరెడ్డి రాములు, కొమ్మిరెడ్డి జ్యోతిలు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో కొమ్మిరెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

ఈ సమయంలో సోమవారం అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి మధుయాష్కితో పాటు ఎల్.రమణ కూడా పాల్గొన్నారు.  అయితే ఈ ర్యాలీ కొమ్మిరెడ్డి ఇంటి ముందుకు చేరుకోగానే అక్కడే వున్న కొమ్మిరెడ్డి వర్గీయులు వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొమ్మిరెడ్డి వర్గంలోని  ఓ వ్యక్తి ఎల్.రమణ పై చెప్పు విసిరారు. అయితే అది ఆయనపై కాకుండా పక్కనే వున్న వేరే వాహనంపై పడింది. 

ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకోవడంతొ గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.