Asianet News TeluguAsianet News Telugu

పార్టీ నేతలపై కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్ లో కలకలం

కొందరు సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని కంకణం కుట్టుకుని పనిచేశారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. నియోజకవర్గ పార్టీలో దొంగలు మోపయ్యారని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి వెంట వచ్చి రూ.5 వేలు, రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Koppula Eshwar makes sensational comments on TRS
Author
Dharmapuri, First Published Feb 13, 2019, 10:26 AM IST

ధర్మపురి: పార్టీ వ్యవహారాలపై ధర్మపురి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు దొంగలు మోపయ్యారని, ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.పైసలడిగే వారిని ప్రజలు చెప్పుతో కొట్టాలని కూడా అన్నారు. 

జగిత్యాల జిల్లా ధర్మపురి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని కంకణం కుట్టుకుని పనిచేశారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. నియోజకవర్గ పార్టీలో దొంగలు మోపయ్యారని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి వెంట వచ్చి రూ.5 వేలు, రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

వాళ్లను కారు ఎక్కించుకుని తీసుక వచ్చి సాయంత్రానికి దావతు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వాళ్లేమో ఎమ్మెల్యే ఇప్పించాడని అనుకోవడం లేదని అన్నారు. వెంట వచ్చిన ఆయన చెప్పడం వల్లనే పైసలు వచ్చాయని అనుకుంటున్నారని అన్నారు. రూ.లక్ష ఇప్పిస్తే 10 వేలు, 20 వేలు.. ట్రాక్టర్లు ఇప్పిస్తే ట్రాక్టర్‌కు రూ.50 వేలు, లక్ష వసూలు చేశారని ఆరోపించారు.
 
కల్యాణలక్ష్మికీ పైసలు వసూలు చేశారని, ఈ దొంగలను నమ్మొద్దని మనవి చేస్తున్నానని అన్నారు. కల్యాణలక్ష్మికి, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎవడైనా పైసలు అడిగితే చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. వాడు మా నాయకుడైనా, మరెవరైనా సరే అని ఆయన అన్నారు. ఎందుకంటే డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధివి అని, అవి మన పైసలు అవి అని ఆయన అన్నారు.
 
తాను ప్రజలను తప్పు పట్టడం లేదని, నాయకులను మాత్రమే తప్పుబడుతున్నానని అన్నారు. నాయకులు ఎక్కడివారు అక్కడ చేతులెత్తేశారని, పని చేయడానికి ఇష్టపడలేదని ఆయన అన్నారు. వాళ్లకు ఆపతి వచ్చినరోజు తాను అలాగే చేశానా అని ఆయన అడిగారు. తాను చెత్తులెత్తేస్తే గతిమిటని కూడా అడిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios